Uno de los mejores poemas de la literatura telugu son:
వేమన పద్యాలు
1
ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ
భావం – ఉప్పూ, కర్పూరం రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి.కానీ వాటి రుచులు మాత్రం వేరు వేరు.అలాగే పురుషుల్లో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు.
2
గంగిగోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైన నేల ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు
విశ్వదాభిరామ వినుర వేమ
భావం – కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది.
3
ఆత్మ శుద్దిలేని యాచార మదియేల
భాండ సుద్దిలేని పాకమేల
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినుర వేమ
భావం – మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు? (ఇవన్నీ వ్యర్ధ అని వేమన భావన)
4 4
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.
భావం – ఎంతో విలువయిన బంగారం శబ్ధం అంత విలువ లేని కంచు కంటే ఎలా తక్కువగా ఉండునో అలాగే మంచి వాని మాటలు చాలా చల్లగా నిరాడంబరంగా ఉంటే చెడ్డ వాని మాట మాట మాత్రం ఆడంబరంగా ఉంటుంది.
5 5
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ
భావం – పాడగా పాడగా రాగం వృద్ది అవుతుంది.తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది.అలాగే దృడ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చెయ్యగా అది తప్పకుండా సమకూరుతుంది.
6 6
ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విరిగినేని మరియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ
భావం – ఇనుము విరిగితే దానిని రెండు మూడు సార్లు అతికించవచ్చు.కానీ అదే మనిషి మనసు ఒక సారి విరిగితే (అంటే ఏదైనా విషయం వల్ల మనసు నొచ్చుకుంటే) దానిని మరళా అతికించుట ఆ బ్రహ్మ దేవిని వల్ల కూడా కాదు.
7 7
ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ
భావం – ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా మారదు.అలాగే చెక్కబొమ్మ తెచ్చి దానిని ఎన్ని సార్లు కొట్టినా సరె మాట్లాడదు. (దీని అర్ధం ఎమనగా సహజ సిద్ద స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము)
8
ఆపదైన వేళ నరసి బంధుల జూడు
భయమువేళ జూడు బంటుతనము
పేదవేళ జూడు పెండ్లాము గుణమును
విశ్వదాభిరామ వినురవేమ
భావం – ఆపదల్లొ చిక్కుకున్నపుడు సహాయపడేవాడే భందువు.భయముతో ఉన్నపుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు.కటిక బీదరికంలోనైనా భర్తను గౌరవించేదే భార్య.
9 9
చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
నీట బడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ
భావం- ఆల్చిప్పలో పడ్డ స్వాతి చినుకు ముత్యంగా మారుతుంది.నీటిలోన పడిన చినుకు వ్యర్ధం అవుతుంది.అలాగే ప్రాప్తి ఉంటే తప్పకుండా ఫలితం అదే వస్తుంది.
10
చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్కకుక్క కరచి బాధచేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ
భావం – అడవికి మృగరాజు అయిన సిమ్హం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా భాద పెడుతుంది.అందుకే తగిన బలము లేని చోట పౌరుషము ప్రదర్శించరాదు.
సుమతీ శతకం
1
అక్కరకురాని చుట్టము,
మ్రొక్కిన వరమీన వేల్పు, మోహరమునదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ.
భావం -అవసరమయిన సమయములో ఆదుకోని చుట్టము, ఎంత ప్రార్దించినా వరమియ్యని దేవతా, మంచి యుద్దసమయములో తాను చెప్పినట్టు పరుగెత్తని గుర్రములని వెంటనె విడిచిపెట్టవలెను.
2
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ.
భావం -అవసరమునకు అప్పు ఇచ్చు మిత్రుడు, రోగము వచ్చినపుడు చికిత్స చేయుటకు వైద్యుడుని, ఎప్పుడును నీరెండక ప్రవహించు నదియు, శుభాశుభ కర్మలు చేయించు బ్రాహ్మణుడును ఉన్న ఊరిలో ఉండుము.ఈ సౌకర్యము లేని ఊరిలో ఉండకుము.
3
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ.
భావం – మంచిబుద్ది కలవాడా! శ్రీరాముని కరుణ చేత, ప్రజలందరూ మెచ్చునట్లు అందరికీ హితమయున నీతులు చెప్పుము.
4 4
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ.
భావం – బంగారపు సిమ్హసనములో మంచి ముహూర్త బలమున కుక్కను తీసుకు వచ్చి కూర్చోపెట్టినా దాని గుణము ఎలా మార్చుకోదో అధేవిధంగా అల్పుడుకు ఎంత గౌరవము ఇచ్చినా సరే తన నీచత్వమును వదలడు.
5 5
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
తెప్పలుగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ.
భావం- చరువులో నిండా నీరు చేరినపుడు వేల కొలది కప్పలు ఎలా అయితే చేరునో అలాగే సంపద కలిగినపుడు భందువులు కూడా అలానే చేరును.
6 6
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.
భావం- తనకు మేలు చేసిన వానికి తిరిగి మేలు చెయ్యడం సామన్యమయున విషయమే.కానీ తనకు అపకారం చేసినా సరే వాని తప్పులు మన్నించి తిరిగి మేలు చేయువాడే ఉత్తముడు.
7 7
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.
భావం- ఏ సమయములో ఏ మాటలాడితే సరిపోవునో ఆలోచించి, దానికి తగినట్టుగా ఇతరులని భాదించకుండా సమయోచితముతో మాట్లాడి వ్యవహారములను పరిష్కరించువాడే వివేకవంతుడు.
8
కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.
భావం- ఏ వస్తువయైనా సరే తమ తమ స్థానములలో ఉన్నప్పుడే వాటి మద్య స్నేహ భాందవ్యం చక్కగా సాగుతుంది.ఎపుడయితే ఆ స్థానాలు విడిచిపెడతారో తమ మిత్రులే శత్రువులుగా మారతారు.కమలము నీటిలో ఉన్నంతవరకే సూర్యకాంతికి వికసించును.ఎపుడైతే నీటిని విడుచునో అదే సూర్యకాంతికి వాడిపోవును.
9 9
అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ
భావం- ఎంత అడిగినా జీతము ఇవ్వని యజమానిని సేవించి కష్టపడుట కంటే మంచి యెద్దులను కట్టి పొలమి దున్నుకొని బతకడం మంచిది.
కుమార శతకం
1
మర్మము పరులకు దెలుపకు
దుర్మార్గుల చెంత నెపుడు దూఱకు మిల దు
ష్కర్మముల జేయ నొల్లకు;
నిర్మల మతినుంట లెస్స నిజము కుమారా!
భావం – ఓ కుమారా! నీ రహస్యములెప్పుడూ ఇతరులకు తెలియజేయవద్దు. దుర్మార్గులతో స్నేహము చేయవద్దు. ఈ భూమియందు చెడ్డపనులను చేయుట మానుకో. స్వచ్చమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని తెలుసుకో.
2
సద్గోష్ఠి సిరియు నొసగును
సద్గోష్ఠ్యె కీర్తి బెంచు సంతుష్టిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!
భావం – ఓ కుమారా! సజ్జనులు, సత్ఫురుషుల సభలలోనే మంచి జ్ఞానమును సంపదిస్తారు. దానివలన సిరి సిద్ధించును సద్గోష్ఠి వలన కీర్తి పెరుగును, సంతృప్తి కలుగుతుంది. సద్గోష్ఠి వలన సర్వపాపములు సమసిపోవును.
3
సత్తువగల యాతడు పై
నెత్తిన దుర్భలుండు తస్కరించు నతండున్
విత్తము గోల్పడు నతడును
జిత్తని పీడితుండు జింతజెందు కుమారా!
భావం – ఓ కుమారా! శక్తియున్న బలహీనునిపై దండెత్తిన ఆ బలహీనుడు దొంగలుపడి దోచుకున్న గృహము కలవాడైనట్లు ధనహీనుడగును. శక్తి లెక పీడింపబడతాడు. మనస్సు విచారముతో, నిత్యము బాధలతో నుండును.
4 4
వృద్ధజన సేవ చేసిన
బుద్ధి విశేషజ్ఞుఁడనుచు బూత చరితుడున్
సద్ధర్మశాలియని బుధు
లిద్ధరఁబొగిడెదరు ప్రేమయెసగఁ కుమారా!
భావం – పెద్దలను గౌరవించేవాడిని, మంచి బుద్ది కలవాడని, మంచి తెలివి తేటలు కలవాడనీ, ధర్మం తెలిసిన వాడినీ జనులు ఈ లోకంలో పొగుడుతారు.
5 5
ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబుఁ దెలుప నేగకుమీ నీ
కన్నతలిదండ్రుల యశం
బెన్నఁబడెడు మాడ్కిఁదిరుగు మెలమిఁగుమారా!
భావం – నీకు ఉన్నా, లేకున్నా సరే ఆ విషయం బయటికి తెలియనియ్యకు. ఎప్పుడైనా నీకు రహస్యాలు తెలిస్తే, వాటిని ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయకు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కీర్తి దశదిశలా వ్యాపించేలా చేయి.
6 6
ధనవంతుడె కులవంతుడు
ధనవంతుడె సుందరుండు ధనవంతుండే
ఘనవంతుడు బలవంతుడు
ధనవంతుడె ధీరుడనుచు దలతె? కుమారా!
భావం – ఈ లోకమునందు ధనవంతుడిని అన్ని మంచి లక్షణాలు కల ఉత్తముడుగా భావిస్తారు. సంపద కలవాడినిగా, గొప్ప కులంలో జన్మించినవాడినిగా అందగాణ్ణిగా బలవంతునిగా, ధైర్యశాలిగా భావిస్తారు.
7 7
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నింద సేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁ జేయకు
మాచారము విడవఁ బోకుమయ్య కుమారా!
భావం- గురువు మాటకు ఎదురు చెప్పకు. చేరదీసిన వారిని నిందించకు. చేసే పనిపై ఎక్కువ ఆలోచింపకు. మంచి మార్గం వదలి పెట్టకు.
8
వగవకు గడచిన దానికి
పొగడకు దుర్మతుల నెపుడు; పొసగని పనికై
యొగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!
భావం- జరిగిన దాని గురించి భాదపడకు, చెడ్డవారిని ఎలాంటి పరిస్థితులలో పొగడకు. సాధ్యం కాని పనులు వదిలిపెట్టు. దైవం ఎలా నడిపిస్తే అంతా అలాగే జరుగుతుంది.
9 9
సిరి చేర్చు బంధువుల నా
సిరియే శుభముల నొసంగు చెలువుల గూర్చున్
సిరియే గుణవంతుండని
ధరలోఁ బొగడించునంచు దలపు కుమారా!
భావం- సంపద బంధువులను పెంచుతుంది. సంపద శుభాలను కలుగజేస్తుంది. సంపద వలన స్నేహితులు పెరుగుతారు. సంపద కలిగిన మానవుని గుణవంతునిగా కీర్తిస్తారు.
10
పాపపు బని మది దలపకు
చేపట్టిన వారి విడువ జేయకు కీడున్
లోపల తలపకు, క్రూరల
ప్రాపును మరి నమ్మబోకు, రహిని కుమారా!
భావం- మనసులో ఎప్పుడూ చెడ్డ ఆలోచనలకు చోటివ్వవద్దు. కాపాడతానని మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకో దుర్మార్గుల ఆదరణను ఎప్పుడూ నమ్మవద్దు.
భాస్కర శతకం
1
ఒరిగిన వేళ నెంతటి ఘనుండును దన్నొక రొక్క నేర్పుతో
నగపడి ప్రోదిసేయక తనంతట బల్మికిరాడు నిక్కమే;
జగమున నగ్నియైనఁ గడు సన్నగిలంబడియున్న, నింధనం
బెగయెఁగ ద్రోచి యూదక మఱెట్లు రవుల్కొన నేర్చు భాస్కరా! | చ |
2
చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా! | చ |
3
తెలియని కార్యమెల్లఁ గడతేర్చుట కొక్క వివేకి చేకొనన్
వలయు నటైన దిద్దు కొనవచ్చు ప్రయోజన మాంద్య మేమియుం
గలగదు; ఫాలమందుఁ దిలకం బిడు నప్పుడు చేత నద్దముం
గలిగిన చక్కఁ జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా! | చం |
4 4
ఉరుగుణవంతుఁ డొండు తనకొండపకారము సేయునప్పుడుం
బరహితమే యొనర్చు నొక పట్టున నైనను గీడుఁ జేయఁ గా
నెఱుఁగడు నిక్కమే కద; యదెట్లనఁ గవ్వము బట్టి యెంతయున్
దరువఁగఁ జొచ్చినం బెరుఁగు తాలిమి నీయదె వెన్న, భాస్కరా! | చ |
5 5
బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా
బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా! | చ |
6 6
సన్నుత కార్య దక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండొక మేలొపరించు; సత్వ సం
పన్నుడు భీముడా ద్విజుల ప్రాణము కావడే ఏకచక్రమం
దెన్నికగా బకాసురుని నేపున రూపడఁగించి భాస్కరా! | ఉ |
7 7
పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్
దూరములైన వాని యెడ దొడ్డగ చూతురు బుద్ధిమంతు లె
ట్లారయ; గొగ్గులైన మఱి యందుల మాధురి చూచి కాదె ఖ
ర్జూర ఫలంబులన్ ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కరా! ||
8
దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోటనుండి వే
లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁ, గల్ల గాదు, ప్ర
త్యక్షము; వాగులున్ వరదలన్నియు వచ్చిన నీరు నిల్చునే
అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా! | ఉ |
9 9
తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా
ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను; శేషుఁడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి; తా
ననిశము మోవఁడే మఱి మహాభరమైన ధరిత్రి భాస్కరా! | చ |
10
ఊరక సజ్జనుండొదిగి యుండిననైన, దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;
చీరలు నూరు అంకములు చేసెడివైనను బెట్టెనుండగాఁ
జేరి చినింగిపోఁ గొఱుకు చింమట కేమి ఫలంబు భాస్కరా! | ఉ |
భర్తృహరి సుభాషితాలు
1
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
భావం – ప్రయత్నం చేయుట వలన ఇసుక నుంచి తైలం తీయవచ్చును. ఎండమావిలో నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రము సమాధాన పెట్టుట సాధ్యము కాదు
2
తరువు లతిరసఫలభార గురుత గాంచు
నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు
డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత
జగతి నుపకర్తలకు నిది సహజగుణము …!
భావం – బాగా పండ్లున్న చెట్లు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పైపైన కాకుండా కిందుగా సంచరిస్తుంటాయి. ఉత్తములు కూడా అంతే, సంపదవల్ల వారికి గర్వం రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం … లాంటివన్నీ పరోపకారం చేసేవారికి సహజంగానే ఉంటాయని పై పద్యం యొక్క తాత్పర్యం.
Recurso: vemana padyalu | వేమన పద్యాలు | vemana padyalu en telugu con significado | vemana satakam | vemana satakam en telugu pdf | vemana satakam poemas | vemana satakam poemas en teluguvemana historia en telugu | vemana | poema vemana